గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2015 (11:39 IST)

పరపతి సంఘాల అక్రమాలపై విచారణ.. వర్శిటీ నియామకాలకు ప్రత్యేక బోర్డు

ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ పరపతి సంఘాలలో జరిగిన అక్రమాలపై మాత్రమే కేసులు పెట్టామని, వాటిపై మాత్రమే విచారణ సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ పరపతి సంఘాల్లో అక్రమాలు, ఉపాధ్యాయుల నియామకాలపై చర్చ జరిగింది.
 
రైతులను వేధిస్తున్నారంటూ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నల సమాధానం చెబుతూ, ఎక్కడైతే నకిలీ పాసుపుస్తకాలతో లోన్లు తీసుకున్నారో అలాంటి వారిపై మాత్రమే కేసులు నమోదు చేశామన్నారు. వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేదిలేదని అన్నారు. అయితే మామూలు రైతులకు మాత్రం ఎటువంటి వేధింపులు ఉండవని చెప్పారు. ఒక వేళ అలా ఎక్కడైనా జరుగుతోందంటే తాము మళ్లీ విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఎంపిక కోసం త్వరలో రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏపీపీఎస్సీ తరహాలో అధ్యాపకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక కమిటీని నియమించి నియామక నియమనిబంధనలను రూపొందించి ఎలా చేయాలో చూస్తామని చెప్పారు.