శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (21:57 IST)

అనంతపురంలో రైతు ఆత్మహత్య.. అప్పులు భారమై..

వేసిన పంటల్లో తీరని నష్టం వాటిల్లింది. ఆ నష్టం తలకు మించిన భారం అయ్యింది. దానిని భరించడం కష్టమని తేలిపోయింది. ఇక ఆత్మహత్యే మార్గమని భావించిన ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధైర్యం పడొద్దని, మంచి రోజులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పిన  వారం రోజులు కూడా తిరగక మునుపే అనంతపురం జిల్లాలో రైతు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. 
 
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు(32) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసులుకు ఉన్న మూడు ఎకరాల్లో గత కొన్నేళ్లుగా టమాట పంట సాగు చేసి నష్టం చవిచూశాడు.
 
సుమారు రూ. 5 లక్షల దాకా అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఎంతకూ ఇంటికి రాకపోయే సరికి భార్య అరుణ తోటకు వెళ్లి చూసేసరికి విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. బంధువుల సాయంతో కళ్యాణదుర్గం అస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు.