శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (16:09 IST)

ప్రత్యేక హోదాను ఒక రాష్ట్రానికి ఇస్తే, 10 రాష్ట్రాలు అడుగుతున్నాయి.. ఏం చేయలేం : అరుణ్ జైట్లీ

ప్రత్యేక హోదాను ఒక రాష్ట్రానికి ఇస్తే, 10 రాష్ట్రాలు అడుగుతున్నాయి.. ఏం చేయలేం : అరుణ్ జైట్లీ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేవీపీ ప్రైవేట్ బిల్లుపై సభ్యులు మాట్లాడిన తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వమే 3.9 శాతం ఆర్థిక లోటులో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని రాష్ట్రాలకూ రావాల్సిన కేంద్ర ప్రభుత్వ వాటాల్లో ఎలాంటి లోటూ రానీయకుండా సర్దుబాట్లు చేస్తూ వస్తున్నామని, పదే పదే అదనపు నిధులు కావాలని అడుగుతూ ఉంటే ఎలా తెచ్చివ్వాలని ఆయన ప్రశ్నించారు. 
 
ప్రస్తుత రాష్ట్రపతి ఆర్థికమంత్రిగా ఉన్న వేళ, ప్రపంచమే ఆర్థిక మాంద్యంలో మునిగిందని, ఆ ప్రభావం నుంచీ ఇంకా పూర్తిగా బయటపడలేదని తెలిపారు. ఆ సమయంలో 3 శాతం జీడీపీని ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించి లోటును మరింతగా పెంచుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దీంతో ద్రవ్యలోటు ఆరున్నర శాతానికి పైగా చేరిందని, లక్షల కోట్లను రుణంగా తీసుకోవాల్సి వచ్చిందని అరుణ్ జైట్లీ వివరించారు. 
 
ఇకపోతే.. ప్రత్యేక హోదాను ఒక రాష్ట్రానికి ఇస్తే, పది రాష్ట్రాలు కూడా అడుగుతాయని, ఇది సాధ్యమయ్యే పనేనా? అని రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు సమాధానం ఇస్తూ ప్రశ్నించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హోదా రాదన్న సంగతిని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ఎంతిచ్చామో ఆయన వివరించారు. 
 
* సెక్షన్ 90లో తెలిపిన విధంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు. 
* ఐఐటీని ఇప్పటికే ప్రారంభించాం. ఎన్ఐటీ కూడా పనిచేస్తోంది. ఐఐఎం లో విద్యా సంవత్సరం ప్రారంభం. 
* రాష్ట్రం ఏర్పడి కేవలం రెండేళ్లే అయింది. ఎన్నో సంస్థల ఏర్పాటు దిశగా, ఏపీ సర్కారును స్థలం కోరాం. 
* రాజధానిని నిర్మించాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దశలవారీగా నిధులిచ్చేందుకు సిద్ధం.
* సెక్షన్ 46 ఎంతో ముఖ్యం. ఆదాయ పంపిణీపై ఉంది. జనాభా ప్రాతిపదికన 58 శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకూ కేటాయించాం.
* సెక్షన్ 93లోని 13వ షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా పలు జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశాం.
* ప్రధాని ఎంతో చొరవ తీసుకుని ఏపీ పారిశ్రామికాభివృద్ధికి ఎంతో చేశారు. 
 
* పట్టణాభివృద్ధి దిశగా విశాఖకు మెట్రోను ప్రకటించాం. దానికి ప్రాథమిక అనుమతులు వచ్చాయి.
* సున్నితమైన రైల్వే జోన్ విషయంలో అదే రాష్ట్రం నుంచి ఎంపికైన సురేష్ ప్రభు చర్చిస్తున్నారు. 
* జాతీయ హైవేలను నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటించారు.
* కృషి సంచాయ్ యోజన కింద 8 ప్రాజెక్టులు చేపట్టాము.