గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Modified: శనివారం, 20 డిశెంబరు 2014 (06:09 IST)

పెళ్లి ఇంట.. చావు డప్పులు.. ఐదుగురు మృతి ఎలా..?

ఒక్కరోజంతా ఆనందంగా గడిపేశారు. పెళ్ళి సంబరాలు జరుపుకున్నారు. వచ్చిన బంధువులతో మాటామంతీ, మర్యాద పాటించారు. ఆనందంగా నవదంపతులను వదిలి పెట్టడానికి వెళ్ళుతున్నారు. వారిని విధి వెక్కిరించింది. మృత్యువు కబళించింది. ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించిన ఈ సంఘటన కర్నూలు జిల్లా సరిహద్దుల్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. 
 
ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామం చట్రెడ్డిపల్లె చెందిన బిజ్జా నరసయ్యకు కర్నూలు జిల్లా గోపవరానికి చెందిన యువతితో శుక్రవారం వివాహమైంది. అనంతరం తిరుగు పెళ్లిలో భాగంగా చట్రెడ్డిపల్లెకు చెందిన బంధువులతో పెళ్లి కుమారుడు, పెళ్లికుమార్తెతో కలిసి గోపవరానికి లారీలో వెళ్తున్నారు. ఇందులో వరుని బంధువులంతా కలిసి దాదాపు 50 మందికి పైగా ఉన్నారు. ఆనందంగా పెళ్ళి విశేషాలను నెమరు వేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. 
 
అయితే మృత్యువు కూడా వారిని వెంటాడిందనే విషయం వారికి తెలియదు. నల్లమల అటవీ ప్రాంతంలోని పాత రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత లారీ కొండను ఢీకొనడంతో బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు లారీ కింద పడిపోయారు. ఆర్తనాదాలు అరుపుకేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కిందపడిన వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 
 
లారీ కింద పడి చనిపోయిన వారిలో తిరుపాలు, ప్రభాకర్, ఏసోబు, కర్నూలు జిల్లా బోయలకుంటకు చెందిన ఉడుముల జయమ్మ ఉన్నారు. గడ్డం వెంకటయ్య (40) అనే వ్యక్తి గిద్దలూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  50 మందికి పైగా తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వివాహ వేడుకల నడుమ ఆనందాల్ని పంచుకోవాల్సిన తరుణంలో ఇంత విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో వరుడు నరసయ్యకు, వధువుకు ఎలాంటి గాయాలు కాలేదు.