బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (11:29 IST)

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌ రెడ్డిని గ్యాంగ్‌స్టర్ నయీం చంపించాడా?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డిని ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ నయీం చంపించాడా? అనే అనుమానం ఇపుడు కలుగుతోంది. భువనగిరిక

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డిని ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ నయీం చంపించాడా? అనే అనుమానం ఇపుడు కలుగుతోంది. భువనగిరికి చెందిన ఓ వ్యాపారితో నయీం చేసిన సంభాషణలతో ఈ విషయం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
వాస్తవానికి ప్రతీక్ రెడ్డి 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో అతని స్నేహితులైన సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ప్రమాదమేనని, పటాన్‌చెరు వైపు వస్తుండగా గొర్రెలను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పిందని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. దీంతో ఇది రోడ్డు ప్రమాదంగానే పోలీసు రికార్డుల్లో ఉండిపోయింది. 
 
కానీ, ప్రతీక్‌ను తానే చంపించానని నయీమే స్వయంగా చెప్పాడని వ్యాపారవేత్త నాగేందర్ తాజాగా ఆగస్టు 17న భువనగిరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'గత మార్చి 18న నయీం అనుచరులు నన్ను నయీం వద్దకు తీసుకువెళ్ళారు. రూ.5 కోట్లివ్వాల్సిందిగా నయీం నన్ను డిమాండ్ చేశాడు. లేదంటే నా కుటుంబీకుల్ని హతమారుస్తానన్నాడు. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా నా కుమారుల్ని చంపుతానన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకునూ అలాగే చంపానన్నాడు. అది హత్య అని ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చాడు అని వివరించారు. పోలీసులు మాత్రం కేవలం నయీమ్ బెదిరింపుల కోసం చెప్పిన మాటల ఆధారంగా దీనిపై ఓ నిర్ణయానికి రాలేమంటున్నారు.