శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (13:02 IST)

తెలంగాణ ఏమైనా వాటికన్‌ సిటీనా? : మంత్రి గంటా శ్రీనివాసరావు

తెలంగాణ ఏమైనా వాటికన్‌ సిటీనా అంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖాతాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) స్తంభింపజేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి సమాచారం లేకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రాసిన లేఖను బట్టి ఎస్‌బీహెచ్‌ ఏకపక్షంగా ఖాతాలను స్తంభింపజేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అసలు బ్యాంకు నిబంధనల ప్రకారం ఎవరి పేరుతో ఖాతా ఉందో వారే దాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఉన్న పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు సోమవారం ఎస్‌బీహెచ్‌పై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
 
ఈ విషయాన్ని గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. తెలంగాణ సర్కారు వైఖరి దారుణంగా ఉందని, విభజన చట్టానికి తూట్లు పొడుస్తోందని గంటా విమర్శించారు. ఉమ్మడిగా ఎంసెట్‌ నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేసినా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 
 
‘తెలంగాణ ఏమైనా వాటికన్‌ సిటీనా? ఇక్కడ ప్రత్యేక ప్రతిపత్తి ఏమైనా ఉందా? దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న విషయం మరచి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు ప్రవర్తిస్తోంది’ అని విమర్శించారు. ఎంసెట్‌ వివాదంపై వచ్చే నెల 2న జరగనున్న కేబినెట్‌ భేటీలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ‘ఫాస్ట్‌’ పథకం అమలుపై తెలంగాణ సర్కారుకు హైకోర్టు తీర్పు చెంప పెట్టులా మారడంతో కేసీఆర్ వైఖరి మారిందన్నారు.