శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (10:44 IST)

భూసేకరణపై కోర్టు స్టే ఇవ్వలేదు : మంత్రి నారాయణ వివరణ

రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణపై హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీనిని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే విధించినట్టు వార్తలు వస్తున్నాయి.
 
దీంతో మంత్రి పి నారాయణ వివరణ ఇచ్చారు. ఏపీ రాజధాని భూసేకరణ ఉత్తర్వులపై విచారణ జరిగిందని మరో 15 రోజుల వరకు భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటున్నామని, 15 రోజుల తర్వాత భూసేకరణ గురించి మాట్లాడతామని కోర్టుకు చెప్పడం జరిగిందని చెప్పారు. మా వాదనలు విన్న అనంతరం రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 
 
ఇంకా భూసేకరణ చట్టం అమలును ప్రారంభించలేదని, 15 రోజుల తర్వాతే భూ సేకరణ చట్టం అమలు చేస్తామని కోర్టుకు చెప్పడం జరిగిందని మంత్రి తెలిపారు. మే నెలాఖరులోగా 20 వేల ఎకరాల సేకరణ జరుగుతుందని, జూన్‌ నెలలో 20 నుంచి 25 వేల ఎకరాల భూసేకరణ జరుగుతుందని, ఆ వచ్చే నెలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు. కొన్న భూములకు ఇప్పటి వరకు రూ.65 కోట్ల మేరకు పరిహారం చెల్లించినట్టు తెలిపారు.