బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (17:14 IST)

రాష్ట్ర విభజనపై కలాం ఏమన్నారో తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది.. సార్ అంటూ..?

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యల్ని గవర్నర్ నరసింహన్ గుర్తు చేసుకున్నారు. ''జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది రెండు రాష్ట్రాల అభివృద్ధి. అనుభవం కలిగిన నీవు రెండు రాష్ట్రాలను ఆ దిశగా తీసుకెళ్లు'' అని కలాం తనకు సూచించారని నరసింహన్ తెలిపారు. కలాంను ఎప్పుడు కలిసినా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించే మాట్లాడేవారని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు కలాంతో పాతికేళ్లుగా అనుబంధం ఉందన్నారు. 
 
టెక్నాలజీని వ్యవసాయానికి ఉపయోగించడం ద్వారా దేశాభివృద్ధి సులభమవుతుందని తనతో చెప్పేవారని.. ఆయన లోటును తీర్చలేమని గవర్నర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా ఆరోగ్యం, విద్యపై దృష్టి పెట్టాలని సూచించారని, విభజన పూర్తయ్యాక ఇక దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదని తనతో చెప్పేవారన్నారు.

తెలుగు రాష్ట్రాలను ఫాస్ట్ మోడ్ డెవలప్‌మెంట్ చేయాలని, విద్యాశాఖను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని సూచించేవారన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనేది తనకు వర్తించదని.. తనకంటే ఎందరో పెద్దలు త్యాగాలు చేసి మహానుభావులయ్యారని.. అణకువగా చెప్పేవారని నరసింహన్ వెల్లడించారు. 
 
హైదరాబాదుతో కలాంకు చక్కని అనుబంధం ఉందని.. ఎప్పుడొచ్చినా రాజ్ భవన్‌లోనే ఉండేవారని, అక్కడే భోజనం చేసేవారని, ఏ ఫంక్షన్లో అయినా సెక్యూరిటీని లెక్కచేయకుండా పాల్గొనేవారని గవర్నర్ తెలిపారు. విద్యార్థులు, చిన్నారులంటే ఆయనకు చాలా ఇష్టమని చెప్పారు.

తనను ఎప్పుడూ సార్ అని పిలిచేవారని.. అంత పెద్దమనిషి తనను అలా పిలవడం ఎంతో గర్వంగా ఉండేదని నరసింహన్ చెప్పారు. కలాం కర్మయోగి అని ఆయన మార్గంలో, ఆయన మార్గదర్శకత్వంలో పయనించడమే ఆయనకు మనం సమర్పించే ఘన నివాళి అంటూ గవర్నర్ పిలుపునిచ్చారు.