శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 జులై 2014 (11:26 IST)

గవర్నర్ ఇఫ్తార్ విందు: కేసీఆర్ డుమ్మా, అందరూ కలిసిపోయారు..

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, తెలంగాణ మంత్రులు, ఇతర పార్టీల నేతలు, అధికారులు పాల్గొన్నారు. అసలే చల్లని వాతావరణం.. అంతా సరదా సరదాగా కలిసిపోయారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చలోక్తులు విసురుతూ, సందడి చేశారు.  
 
చంద్రబాబు గవర్నర్‌ పక్కన ఉన్నప్పుడు... తెలంగాణ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్‌, శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్‌ దూరంగా నిలబడ్డారు. వారిని చూసి... ‘అంత దూరంగా ఉన్నారేం! రండి. నా దగ్గరకు వస్తే ఎవరూ ఎమీ అనుకోరు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’ అని చంద్రబాబు అన్నప్పుడు మంత్రులు మొహమాటంగా నవ్వుతూ ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేశారు. 
 
ఈ విందుకు గవర్నర్‌ ఇరు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించినా... కేసీఆర్‌ హాజరు కాలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘‘మీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా వస్తే బాగుండేది. దేనికదే! కలిసేచోట కలవాలి. తప్పేం కాదుగా’ అని చంద్రబాబు టీఆర్‌ఎస్‌ నేతలతో అన్నారు. దీనిపై మంత్రులు ఏమీ స్పందించలేదు. నాయిని గతంలో తమతోనే ఉండేవారని, ఇప్పుడు దూరమయ్యారని... దగ్గరకు కూడా రావడం లేదని చంద్రబాబు సరదాగా అన్నారు.