శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (15:27 IST)

ఆపరేషన్ జీజీహెచ్... గుంటూరులో 72 గంటల స్పెషల్ డ్రైవ్

జిల్లా కేంద్రమైన గుంటూరులో ప్రభుత్వ యంత్రాంగం ఆపరేషన్ జీజీహెచ్‌ను చేపట్టింది. ఇందులోభాగంగా 72 గంటల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఆస్పత్రిని పూర్తిస్థాయిలో శుభ్రం చేయడం, తాగునీరు, విద్యుత్, మురుగునీటిపారుదల వంటి మౌలిక వసతులను మెరుగుపరచడం, ప్రతి వార్డుని అద్దంలా తీర్చిదిద్దడం, వ్యవస్థను క్రమబద్ధం చేయడం, పనికిరాని పాత నిర్మాణాలను తొలగించడం వంటి పనులను అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. 
 
జీజీహెచ్‌లో పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, జేసీ శ్రీధర్‌, ఇతర అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ... జీజీహెచ్‌ను కలల ఆస్పత్రిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. 10 రోజుల్లో ఆస్పత్రిని అన్ని పారిశుద్ధ్య పనులు పూర్తిచేసి ఆస్పత్రిని స్వచ్ఛంగా మారుస్తామని చెప్పారు. అనంతరం జేసీ శ్రీధర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ రెండో తేదీ నాటికి ఆస్పత్రిని పరిశుభ్రంగా మారుస్తామన్నారు. పాత భవనాలను కూల్చివేసి... కొత్త నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు తెలిపారు.