శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

వరంగల్‌లో 69 శాతం పోలింగ్.. ఓటర్లకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు..

వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నిక అయినప్పటికీ ఓటర్లు ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం గమనార్హం. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
 
పట్టణ, గ్రామీణ ప్రాంత ఓటర్లు భారీగా ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమయ్యారని అన్నారు. ప్రజలు వారికున్న ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని తెలిపారు. ఉప ఎన్నికలైనప్పటికీ ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఓటింగ్‌కు తరలివచ్చారని, క్యూలైన్లలో కొంతసేపు వేచివుండాల్సి వచ్చినప్పటికీ ఓపికగా నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారందరికీ అభినందనలు తెలిపారు.
 
ఇదిలావుండగా, వరంగల్ లోక్‌సభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీస్థాయిలో 10 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 69.01 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. 
 
ఈ పోలింగ్‌లో అత్యధికంగా పరకాల అసెంబ్లీ పరిధిలో 76.69 అత్యల్పం కాగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 48.03 శాతం పోలింగ్ నమోదైంది. పరకాల మండలం వరికోలు గ్రామంలో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచే చలిగాలులను సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు.