గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 22 సెప్టెంబరు 2016 (13:52 IST)

గుంటూరును గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న భారీ వ‌ర్షాలు

గుంటూరు: జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనుపాలెం-రెడ్డిగూడెం రైల్వే ట్రాక్‌లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు రైళ్లు న

గుంటూరు: జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనుపాలెం-రెడ్డిగూడెం రైల్వే ట్రాక్‌లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద కారు గల్లంతైంది. కారు నుంచి ముగ్గురు వ్యక్తులు బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. మరోవైపు బ్రాహ్మణపల్లి వద్ద వాగులో నలుగురు గల్లంతయ్యారు. ఒకరు చనిపోయారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. అటు క్రోసూరు మండలం విప్పర్ల వద్ద ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
 
పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు నీటిలో చిక్కుకుపోయారు. మరోవైపు నకిరేకల్లులో పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. నర్సారావుపేట సమీపంలోని జొన్నలగడ్డ వద్ద గల బ్రిడ్జ్ నీటి ఉధృతికి కొట్టుకుని పోయింది. బ్రిడ్జ్‌పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నర్సరావుపేటలో వరద ఉధృతిని స్పీకర్ కోడెల శివప్రసాద్ సమీక్షిస్తున్నారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు. మేడికొండూరులో అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గుంటూరు మాచర్ల, వినుకొండ వెళ్లే రహదారుల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
 
చిలకలూరిపేట మండలం అమీన్‌సాహెబ్ పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు కాపలాగా ఉంటున్న ఓ కుటుంబం నీటిలో కొట్టుకునిపోయారు. వారిలో ఓ బాలుడు చెట్టుకు వేలాడుతుండగా అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి సైతం గల్లంతయ్యాడు. కారంపూడి వద్ద ఎర్రవాగు, దాచేపల్లి వద్ద నాగులేరు, మాచర్ల వద్ద చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు రైలు రవాణా మార్గం పూర్తిగా స్తంభించింది.  
 
గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు:
* నకరికల్లు- 24.1 సెం.మీ.
* నరసరావుపేట- 22.4 సెం.మీ
* మేడికొండూరు- 21 సెం.మీ
* బెల్లంకొండ- 19.1 సెం.మీ.
* ముప్పాళ్ల-18. 6 సెం.మీ
* ఫిరంగిపురం- 16.3 సెం.మీ
* సత్తెనపల్లి -16.1 సెం.మీ
* పత్తిపాడు- 15.2 సెం.మీ
* వట్టిచెరుకూరు-14.6 సెం.మీ
* నాదెండ్ల- 14 సెం.మీ
* పెదనందిపాడు- 11.9 సెం.మీ
* పొన్నూరు- 11.7 సెం.మీ
* పీవీపాలెం-10.8 సెం.మీ
* రొంపిచెర్ల-10.6 సెం.మీ
* రాజుపాలెం- 10.3 సెం.మీ
* కాకుమాను -10.3 సెం.మీ
* నగరం-9.4 సెం.మీ
* యడ్లపాడు-9.3 సెం.మీ