గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (10:29 IST)

రేవంత్ బెయిల్ కోసం మరోమారు హైకోర్టు గడపతొక్కిన లాయర్లు!

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఆయన తరపు న్యాయవాదులు మరోమారు హైకోర్టు గడపతొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ క్లయింటు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిలార్డరులో ఉన్న తప్పులను సవరించి తిరిగి ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ, ఆయన తరపు న్యాయవాదులు బుధవారం ఉదయం హైకోర్టులో మెమో దాఖలుచేశారు. 
 
న్యాయమూర్తి దీన్ని పరిశీలించి మరో ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించాల్సిఉంది. ఆ తర్వాత తప్పులు సవరించిన ఆర్డర్ న్యాయవాదుల చేతికి అందాక, దాన్ని చర్లపల్లి జైలు అధికారులకు అందజేస్తేగానీ రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశంవుంది. 
 
లేకుంటే ఆయన మరోరోజు జైల్లో గడపాల్సిరావచ్చు. కాగా, హైకోర్టు ఉత్తర్వుల కాపీలో, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా, ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఉన్న కారణంగానే మంగళవారం ఆయన విడుదల కాలేకపోయారని రేవంత్‌ తరపు న్యాయవాది సుధీర్‌ కుమార్‌ వివరించారు. టైపింగ్ పొరపాటు వల్లనే ఇది జరిగిందని ఆయన అన్నారు.