గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:34 IST)

7 రోజులు అంతర్రాష్ట్ర పన్ను కట్టొద్దు: టీ ఎంట్రీ ట్యాక్స్‌పై హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ (అంతర్ రాష్ట్ర పన్ను)ను వారం పాటు వసూలు చేయొద్దని ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని సూచించింది. అదేసమయంలో కోర్టును ఆశ్రయించిన వారు తప్ప మిగతా వారంతా ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
 
ఎంపీ కేశినేని నాని తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. పిటిషన్‌పై వాదనల సమయంలో, రవాణా పన్ను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కోర్టుకు తెలిపారు. దాంతో, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో జీవో నంబరు 15ను రద్దు చేయాలని కోర్టును కోరారు. వీరి మొరను ఆలకించిన హైకోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. 
 
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఎంట్రీ ట్యాక్స్‌పై తెలంగాణ రాష్ట్రంలోని లారీ యజమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. జీవో నంబర్ 15ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాహనాలపై పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. 
 
ఉమ్మడి రాజధానికి వచ్చే వాహనాలపై పన్నులు విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో, జీవోను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి పన్ను విధానం అవలంభించాలని వారు కోరారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని వారు హెచ్చరించారు. కాగా, సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.