శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (07:09 IST)

అటు వెంకయ్య రంగం నుంచి తప్పుకున్నారు.. ఇక్కడ ఫిరాయింపు మంత్రులకు నోటీసులు?

ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుండెదడ మొదలైపోయింది. వైఎస్సార్సీపీ తరపున గెలిచి అధికార టీడీపీలోకి ఫిరాయించి మంత్రులుగా నియమితులైన ఎన్‌. అమర్‌ నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, సి.ఆది నారాయణరెడ్డి, సుజయ కృష్ణా రంగారావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మొత

ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుండెదడ మొదలైపోయింది. వైఎస్సార్సీపీ తరపున గెలిచి అధికార టీడీపీలోకి ఫిరాయించి మంత్రులుగా నియమితులైన ఎన్‌. అమర్‌ నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, సి.ఆది నారాయణరెడ్డి, సుజయ కృష్ణా రంగారావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాజకీయాలనుంచి తప్పుకుని ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడం, కొన్ని గంటల్లోపే హైకోర్టులో ఫిరాయింపు మంత్రుల వ్యవహారంపై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడం ఒకే రోజు జరగటం సంచలనానికి దారితీసింది. 
 
పార్టీ ఫిరాయించిన అమర్‌నాథ్‌రెడ్డి,  అఖిల ప్రియ, ఆదినారాయణరెడ్డి, సుజయ కృష్ణా రంగారావుకు మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, మంత్రులుగా ఏ అర్హతతో కొనసాగుతున్నారో వారిని వివరణ కోరాలంటూ హైదరాబాద్‌కు చెందిన పాత్రికే యుడు తంగెళ్ల శివప్రసాద్‌రెడ్డి వేర్వేరుగా నాలుగు కో వారెంట్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. 
 
పిటిషనర్‌ తరపు న్యాయవాది ఆనంద్‌కుమార్‌ కపూర్‌ వాదనలు వినిపించారు. టీడీపీలో చేరిన అఖిల ప్రియ, సుజయ కృష్ణా, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న వారు చట్టసభల్లో సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదన్నారు. చట్టసభల్లో సభ్యులుగా కొనసాగే అర్హత లేని వారిని మంత్రులను చేయడానికి వీల్లేదని వివరించారు. రాజ్యాంగం ఓ వ్యక్తిని మంత్రి కాకుండా నిషేధించినప్పుడు ఆ వ్యక్తిని మంత్రిగా నియమించే విషయంలో సీఎం సలహాను గవర్నర్‌ పాటించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 
 
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని గవర్నర్‌ ప్రమాణం చేశారని, అటువంటి వ్యక్తి రాజ్యాంగం నిషేధించిన వ్యక్తి చేత మంత్రిగా ప్రమాణం చేయించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ప్రభుత్వ వివరణ కోరింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటితో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్‌ చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనను ఆనంద్‌కుమార్‌ వ్యతిరేకించారు. 
 
ఆ వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాలను జత చేయవద్దని, ఆ వ్యాజ్యాలు విచారణకు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని తెలియజేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చారు. దీంతో వారికి కూడా న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవుల అంశంపై వారు వివరణ ఇవ్వాలని సూచించింది.  
 
కాకతాళీయంగా ఏపీలో జరిగిన రెండు ఘటనలు పరిశీలకుల మెదడుకు మేత పెడుతున్నాయి. ఇది దేనికదేగా జరిగిన విడి ఘటనలా లేక లోపల గూడుపుఠానీ జరుగుతోందా అర్థం కావటం లేదు. దీని భావమేమి తిరుమలేశ. వెంకయ్య రాజకీయాలనుంచి తప్పుకుంటే అభివృద్ధి ఆగిపోదు కానీ రాజకీయంగా టీడీపీకి నష్టమేనని నిన్న గాక మొన్న చంద్రబాబు చెప్పింది  దృష్టిలో ఉంచుకుంటే.. ఏపీలో ఏం జరుగుతోంది.. ఏం జరుగనుంది అనే ప్రశ్నలు రాకమానవు.