గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (07:39 IST)

ముందు కూర్చుని మాట్లాడుకోండి..మాకు తెలపండి...తెలుగు, అంబేద్కర్ వర్శిటీలపై హైకోర్టు స్టే

అసలు ఈ గొడవేంటి..? ఇలా అయితే వర్శిటీలు నడిచేదెలా.. ఏడాదిగా ఇప్పటికే సమయం వృధా చేశారు. రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోండి. ఓ అవగాహనకు వచ్చిన తరువాత కోర్టుకు తెలపాలంటూ హైకోర్టు మంగళవారం తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాల సేవలను ఏపీకి కొనసాగించడంపై హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. 
 
రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి చాంబర్‌లో సమావేశమై తెలుగు యూనివర్శిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీల సేవలను ఏపీకి కొనసాగింపుపై ఒప్పందానికి రావాలని కూడా డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. సమావేశం వివరాలను, పురోభి వృద్ధిని శుక్రవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
 
ఇందుకు అనుగుణంగా మూడు వ్యాజ్యాలను కలిపి విచారించేందుకు వీలుగా శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ సమావేశంలో ఏ రాష్ట్ర కార్యదర్శి హాజరుకాక పోయినా, సహకరించకపోయినా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలను జారీ చేస్తామని హెచ్చరించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై మంగళవారం విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.