శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2015 (09:32 IST)

పోలీసే దొంగైతే...?.. ఇంటి దొంగను పట్టుకున్న పోలీసులు

పోలీసే దొంగైతే ఇంకేముంది... జనాన్ని అలా నమ్మించి.. అలా దోచేయవచ్చు.. పగలంతా జనానికి భద్రత కల్పించే పనిలో బిజిబిజిగా ఉండే ఓ హోంగార్డు ఉదయం సాయంత్రం వారి దోచుకునే పనిలో అంతే బిజిగా ఉంటాడు. రెండేళ్లుగా పోలీసులకు చిక్కకుండా చాలా జాగ్రత్తగా తన పని తాను కానించేసిన అతగాణ్ణి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు కిలో బంగారు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
హైదరాబాద్ నగరం బాలానగర్ ఏసీపీ ట్రాఫిక్ పీఎస్‌లో పని చేసే ఓ హోంగార్డు స్నాచర్ అవతారమెత్తాడు. ఉదయం, సాయంత్రం చాలు అతని చేతులు దురద పెట్టేస్తాయి. ఎక్కడో ఓ చోట మహిళ మొడలోంచి చైన్ లాగందే ఉండడు. రెండేళ్లుగా స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. కాగా, హెచ్‌ఏఎల్ కాలనీలో మూడుసార్లు అటు ఇటు వాహనంపై తిరుగుతున్న వ్యక్తిని ఓ మహిళ ఫొటో తీసింది. అర గంట క్రితం జరిగిన ఓ స్నాచింగ్‌పై ఆరా తీస్తున్న పోలీసులకు తన వద్ద ఉన్న కీలక ఆధారాన్ని అందించింది. 
 
వెంటనే జీడిమెట్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి.. సదరు మహిళ ఇచ్చిన ఆధారాల మేరకు ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి..ఓ వ్యక్తి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోంగార్డుగా ఓ వైపు అధికారులతో శభాష్ అనిపించుకుంటూ.. మరో వైపు స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్న ఇతగాడి బాగోతం చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. అతని దగ్గర నుంచి కిలో బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.