గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (09:56 IST)

మేయర్ అనురాధా హత్య కేసు : చింటూ కోసం ప్రత్యేక బృందాలు

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కటారి అనురాధా, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ ఆచూకీని తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు చింటూ కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. 
 
ఆర్థిక గొడవలతో మేనల్లుడు చింటూనే వీరి ప్రాణాలు తీసినట్టు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. దీంతో అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఇంటు చింటూ అనుచరుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. గంగనపల్లిలో చింటూ ప్రధాన అనుచరుడు పరంధామ ఇంటి నుంచి 7 హార్డ్‌ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌తో పాటు కొన్ని ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తంబళ్లపల్లె సర్పంచ్‌ కొండ్రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగలగొట్టి మరీ తనిఖీ చేశారు. 
 
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు వ్యక్తుల నుంచి ప్రాధమిక వాంగ్మూలాన్ని స్థానిక మూడో అదనపు కోర్టు నమోదు చేసింది. ప్రత్యక్ష సాక్షులైన సతీష్, కిషోర్, మురళీ... న్యాయమూర్తి ముందు వివరాల్ని వెల్లడించారు. చింటూ ఆఫీస్‌లోని సీసీ కెమెరాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడి కార్యాలయానికి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు కలిశారు? డబ్బు సహాయం... ఆయుధాలు... వంటి దృశ్యాలు దొరికే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తనకున్న సంబంధాలతో పోర్టుల నుంచి సముద్ర మార్గాన పరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆ దిశగా నిఘా పెంచారు పోలీసులు. ఎక్కడికక్కడ అలర్ట్‌ చేసి... డేగ కళ్లతో చింటూ కోసం గాలిస్తున్నారు. 

ఇదిలావుండగా, చిత్తూరు నగరానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో పాటు వ్యాపారులను కూడా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇందులోభాగంగా ఇప్పటికే 28 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో 40 మందికి కూడా నోటీసుల జారీకి రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. నోటీసులు అందుకున్న వారితో పాటు అందుకోబోయే వారంతా కూడా చింటూతో వ్యాపార లావాదేవీలు కలిగినవారేనన్న ప్రచారమూ సాగుతోంది.