శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (17:40 IST)

అదే నిజమైన 'హోలీ'... భర్తల భరతంపట్టిన భార్యలు..!

హోలీ పండుగంటే రంగుల వెదజల్లులు. అక్కడ మాత్రం భర్తలకు బాదులే బాదులు... ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సామ్యతండాలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా శుక్రవారం కోలాహలంగా హోలీ పండుగను జరుపుకున్నారు. హోలీ వచ్చిందంటే అక్కడ మహిళల ఆనందానికి అవధులు ఉండవు. హోలీ రోజున జరుపుకునే సంప్రదాయ వేడుకైన డూండ్‌ వేడుకలో భార్యలు, భర్తల భరతం పట్టారు.
 
హోలీ పండుగ రోజున భార్యలు, భర్తలను ఇష్టమొచ్చినట్లు బాదారు. భార్యలు ఎంత కొడుతున్నా.. భర్తలు మాత్రం తప్పించుకుంటూ తిరగాలే తప్ప, వారిని ఏమీ అనరాదు. దీంతో రెచ్చిపోయిన సతీమణులు తమ భర్తలను చిరునవ్వులు చిందిస్తూనే ఉతికేశారు. 
 
డూండ్ అంటే వెతకడం అని అర్థం. గత ఏడాది హోలీ నుంచి ఈ హోలీ రోజుకు మధ్య కాలంలో తండాలో ఈ ఏడాది జన్మించిన మగ పిల్లాడిని సంప్రదాయబద్ధంగా తెల్లవారుజాము 4 గంటలకు మహిళలు(గెరినీలు) దాచిపెట్టారు. వాడిని కర్రలు చేతబట్టిన పురుషులు (గేర్యాలు) వెతికారు.
 
పిల్లాడు దొరికిన తర్వాత మహిళలు, పురుషులు కలిసి కామదహనం చేసి రంగులు పూసుకున్నారు. అనంతరం తండాలోని వారంతా కలిసి పిండివంటలు చేసుకుని వాటిని పిల్లాడి ఇంటి వద్దనున్న స్థూపం వద్ద గంగాళాల్లో పెట్టారు. ఆ గంగాళాలను తాడుతో కట్టేసి కర్రలు చేతబూని మహిళలు కాపలా ఉన్నారు.
 
అప్పుడు పురుషులు వాటిని దొంగతనం చేయాలి. అలా చేసినప్పుడు పురుషుల ఒళ్లు వాచేలా భార్యలు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తినుబండారాలను దొంగతనం చేసిన వ్యక్తిని తండా ధీరుడిగా గుర్తించారు. ఆ తినుబండారాలు కామదహనం చేసిన ప్రాంతంలో పంచుకుని తిని ఆనందంగా అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. అదీ హోలీ...!!