శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (09:31 IST)

భారత్ కంటే.. పాకిస్థాన్ - బంగ్లాదేశ్‌లు బెస్ట్ : చీఫ్ జస్టీస్ గుప్తా

న్యాయశాఖకు నిధులు కేటాయించడంలో భారత్ కంటే పాకిస్థాన్ దేశాలు ఎంతో నయమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. మంగళవారం నల్సార్ యూనివర్శిటీలో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
న్యాయ శాఖకు కేంద్రం కేటాయిస్తున్న నిధులు జీడీపీలో 1 శాతం కన్నా తక్కువుగానే ఉన్నాయన్నారు. కానీ, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మనకన్నా కాస్త ఎక్కువగానే నిధులు న్యాయశాఖకు విడుదలవుతున్నాయని జస్టిస్ గుప్తా చెప్పుకొచ్చారు. ఈ చీఫ్ జస్టీస్ చేసిన వ్యాఖ్యలు వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఆయన చెప్పిన కారణం వింటే మాత్రం అది అక్షరాలా వాస్తవం. 
 
దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసుల గుట్టలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీనికి కారణంగా అవసరమైన మేర న్యాయమూర్తుల పోస్టులతో పాటు న్యాయవాదుల పోస్టులూ భర్తీ కాకపోవడమేనట. దేశంలోని కోర్టుల్లో ప్రస్తుతమున్న న్యాయమూర్తుల సంఖ్యకు మరో పది శాతం న్యాయమూర్తులను చేర్చితే దేశంలో ఒక్క పెండింగ్ కేసు అనేది ఉండబోదని ఆయన చెప్పారు.