శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (10:13 IST)

దాశరథి పేరిట పురస్కారం: గురుభక్తి చాటుకున్న కేసీఆర్!

ప్రముఖ కవి, సాహితీవేత్త దివంగత దాశరథి కృష్ణమాచార్య పేరిట స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన కవికి ఆ పురస్కారం రూపంలో రూ. లక్షా నూట పదహార్లు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయానికి లేదా ప్రముఖ విద్యాసంస్థకు ఆయన పేరు పెడతామని వెల్లడించారు. దాశరథి 89వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా మంగళవారమిక్కడి రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
 
ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన దాశరథి కృష్ణమాచార్య వంటి వారిని ఈ ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తుందని చెప్పారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతంలో దాశరథి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు తెలిపారు. ఆయన కుమారుడికి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాగా, రవీంద్రభారతిలో సరైన ఏర్పాట్లు లేవని, ఇకపై అలాంటి లోపాలు లేకుండా ప్రతి సంవత్సరం రూ.కోటి గ్రాంటును మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు.
 
ఇకపోతే.. సీఎం సభావేదికపైకి వస్తుండగా ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య కనిపించారు. వెంటనే కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. తాను దుబ్బాక పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన తెలుగు బోధించేవారని తెలిపారు.