గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 28 మే 2015 (12:47 IST)

శివరామకృష్ణన్ మృతి: అమరావతి నిర్మాణాన్ని ఆపలేం..ఎన్జీటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన మాజీ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ విభజనకు ముందు ఏపీ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. తరువాత ఆ కమిటీ 187 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది.
 
ఇదిలా ఉంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని అడ్డుకోలేమని జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. కృష్ణానది ఒడ్డున రాజధానిని నిర్మిస్తే వరదలు వస్తాయని చెబుతూ, పర్యావరణ ప్రభావ మదింపు జరిపేందుకు ఆదేశాలివ్వాలని, అమరావతి నిర్మాణంపై స్టే విధించాలని విజయవాడ నివాసి పందలనేని శ్రీమన్నారాయణ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
పర్యావరణ ప్రభావ మదింపు జరపాలన్న అంశంపై మాత్రం విచారణ చేపడతామని చెబుతూ, కేసును జులై 27కి వాయిదా వేసింది. అంతకుముందు ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సారవంతమైన సాగు భూములున్నాయని పిటిషనర్ గుర్తు చేశారు. జస్టిస్‌ యూ.డీ. సాల్వి, జస్టిస్‌ ఎన్‌.ఎస్‌. నంబియార్‌, నిపుణులు డాక్టర్‌ దేవేంద్ర కుమార్‌ అగర్వాల్‌, ప్రొఫెసర్‌ ఏ.ఆర్‌. యూసుఫ్‌, విక్రమ్ సింగ్‌ సజ్వన్‌‌లతో కూడిన విస్తృత ధర్మాసనం అమరావతి నిర్మాణాన్ని ఆపలేమని తేల్చిచెప్పింది.