శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 3 మే 2015 (18:23 IST)

''నా జోలికి ఒకరు వస్తే, వంద మంది జోలికి వెళతా''.. శివాజీ స్పష్టం..!

తన జోలికి ఒకరు వస్తే, తాను వంద మంది జోలికి వెళతానని నటుడు శివాజీ స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టిన ఆయన ఆదివారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడుతూ.. తనను ఎవరో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తన జోలికి రావాలంటే, అన్నిటికీ సిద్ధపడి రావాలని సవాల్ విసిరారు. 
 
తాను తన కోసం పోరాడడం లేదని, తెలుగుజాతి కోసం, పిల్లల భవిత కోసం తాను ఉద్యమం చేస్తున్నానని అన్నారు. తన జోలికి ఒక్కరు వస్తే, తాను వందమంది జోలికి వెళతానని స్పష్టం చేశారు. దేనికైనా తాను సిద్ధమేననని ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.
 
ఆదివారం ఉదయం మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ఎందుకు ముందడుగు వేయడంలేదో పవన్ కళ్యాణ్‌ను అడగాలని శివాజీ సూచించారు. పవన్ తలచుకుంటే కేంద్రం దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందన్న నమ్మకం తనకుందని అన్నారు. తనకు ఎవరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని, వారికి వారుగా రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాడితే చాలునని తెలిపారు. తనకు ఏ విధమైన పదవులు అక్కర్లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే చాలని కోరారు. అసలు తానేమీ కొత్తగా కోరడం లేదని, ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే చాలునని శివాజీ అన్నారు.
 
ప్రత్యేక హోదా కల్పిస్తే రాజకీయ నాయకులకు గొడుగులుగా ఉండి ప్రజలు రుణం తీర్చుకుంటారని శివాజీ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేస్తున్న నేతలు తమ విధులను మరిచి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని లేకుంటే ఆంధ్ర ప్రజలు అడుక్కు తినాల్సి వస్తుందని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అయిన తరువాతనే ఆమరణ దీక్ష నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటి వరకూ తన తల్లితో మాట్లాడలేదని తెలిపారు. తనకీ స్థాయిని కల్పించిన ప్రజల రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని భావిస్తున్నానని వివరించారు.