గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (05:59 IST)

రఘురామ కృష్ణంరాజుతో వైసీపీకి చిక్కులు?

నరసాపురంలో వైసీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. తమ పార్టీ ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజు జోరుకి ఎలా బ్రేకులు వేయాలో వారికి తెలియడం లేదట! వద్దని చెప్పే కొద్దీ బీజేపీ పెద్దలకి ఆయన టచ్‌లోకి వెళుతుండటం వైసీపీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో వారికి బోధపడటం లేదట. వాస్తవానికి రఘురామ కృష్ణంరాజు బీజేపీని ఆసరాగా చేసుకునే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో కమలం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా, చివరి నిముషంలో గోకరాజు గంగరాజుకి టిక్కెట్‌ దక్కింది. దీంతో రఘురామ కృష్ణంరాజు కొంత కాలంపాటు కినుక వహించారు.
 
తర్వాత కాలంలో రఘురామ కృష్ణంరాజు మళ్లీ తెరపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరి కొన్నాళ్లు యాక్టివ్‌ రోల్‌ పోషించారు. 2019 ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ పక్షాన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అసలు ట్విస్ట్‌ అప్పుడే మొదలైంది. ఎంపీగా గెలిచిన అనంతరం రఘురామ కృష్ణంరాజు తన వైఖరిని కొంత మార్చుకున్నారు.

తన సొంత పార్టీ వైసీపీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, బీజేపీ ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉండటం మొదలుపెట్టారు. ఒకపక్క తాను గెలిచిన పార్టీని గౌరవిస్తున్నట్టుగా వ్యవహరిస్తూనే.. మరోపక్క దేశ రాజధానిలో బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులను తరుచుగా కలుస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా పరిణమించింది.
 
ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలు ఒక తరుణోపాయం ఎంచుకున్నారట. నరసాపురం నియోజకవర్గంలో కొత్త ఎత్తుగడకి శ్రీకారం చుట్టారట! రఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టాలంటే, నరసాపురంలోనే ఆయనకు ధీటుగా పార్టీలో మరో వర్గాన్ని తయారుచేయాలని తలపోస్తోందట హైకమాండ్.

అనుకున్నదే తడవుగా.. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబానికి వల విసిరింది. ఆ వలలో చిక్కిన గంగరాజు పెద్దకుమారుడు రంగరాజు, గంగరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు వైసీపీలో చేరడానికి సిద్ధపడ్డారట! మాజీ ఎంపీ గంగరాజు మాత్రం తాను వైసీపీలో చేరడం లేదని విస్పష్టంగా చెప్పారనుకోండి- అది వేరే విషయం.
 
ఆ విధంగా వైసీపీలో చేరిన గంగరాజు కుటుంబ సభ్యులను అడ్డంపెట్టుకుని రఘురామ కృష్ణంరాజుని కట్టడిచేయాలని భావిస్తున్నారన్నది వైసీపీ వర్గాల టాక్‌. నరసాపురం లోక్‌సభ స్థానంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ పరిస్థితిపై రాజకీయ పండితులు ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా రఘురామ కృష్ణంరాజుకి చెక్‌ పెట్టడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే, వైసీపీలో చేరిన గోకరాజు నరసింహరాజుకు, రంగరాజుకు రాజకీయ అనుభవం లేనేలేదు. మరో కుటుంబ సభ్యుడు గోకరాజు రామరాజుకు మాత్రం కొద్దోగొప్పో రాజకీయ చరిత్రే ఉంది.

గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అది కొంతవరకు వైసీపీకి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు రాజకీయ పండితులు. మిగిలిన వారివల్ల పార్టీకి లాభం చేకూరుతుందా? వారు రఘురామకృష్ణంరాజును నియంత్రించగలరా? అనేది అనుమానమే.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. మాజీ ఎంపీ గంగరాజు పెద్దకుమారుడు రంగరాజుకు జగన్‌కు మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో రంగరాజుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.