శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (14:50 IST)

జగన్‌పై దాడి.. గవర్నర్ ఫోన్.. రోజా ఫైర్.. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటి?

ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పందించారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి వెంటనే తనకు పూర్తిస్థాయి నివేదిక పంపించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై దాడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. రాజకీయంగా అణచివేసేందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. ఈ కుట్ర వెనకాల ఉన్నవాళ్లెవరో బయటకు రావాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.
 
ఎయిర్ పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ అనే వెయిటర్ కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై హత్యకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించిన రోజా.. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌పై చిన్న చాకుతో దాడి చేశారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయని... ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే, దాన్ని చిన్న విషయంగా తీసి పారేస్తారా? అని మండిపడ్డారు.