శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:49 IST)

జగ్గారెడ్డికే పగ్గాలు: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ?

మెదక్ జిల్లా కాంగ్రెస్ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని అధిష్టానం నియమించింది. అలాగే తెలంగాణకు సంబంధించి మూడు జిల్లాలు మెదక్, రంగారెడ్డి, అదిలాబాద్‌లకు సంబంధించి డిసిసి అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఆదేశాలు జారీ చేశారు.
 
రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా కె. మల్లేష్, అదిలాబాద్ జిల్లా డిసిసి దేశ్‌పాండే నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరి జనార్థన్ ద్వివేది గురువారం ప్రకటన విడుదల చేశారు. పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచన మేరకే ఆ ముగ్గురి నియామకం జరిగినట్లు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి జగ్గారెడ్డి సిద్ధపడుతున్నారని తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యర్థిగా, జగ్గారెడ్డి సరిపోతారని టాక్ రావడంతో మెదక్ సీటును జగ్గన్నకే ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. 
 
ఇక మెదక్ లోకసభ సీటు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పోటీకి దించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మెదక్ టికెట్‌ను దక్కించుకుని, తెరాసను ఢీకొనడానికి జగ్గారెడ్డి సిద్ధపడుతారా అనేది ఆసక్తికరంగా మారింది.