గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2015 (12:01 IST)

ఎమ్మెల్యే పదవి ఓ తోక... దసరా తర్వాత చెపుతా : వైకాపా ఎమ్మెల్యే ఆది

వైకాపా సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని తెలుస్తున్నాయి. జగన్‌కు ఝులక్ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుకు చెంతకు చేరబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. ఈ ప్రచారానికి ఆయన తెరదించారు. 
 
‘తోకలాంటి ఎమ్మెల్యే పదవి వదిలించుకుంటాను’ అని ప్రకటించారు. ఆ తర్వాత... అందరికీ తన నిర్ణయం చెబుతానన్నారు. ‘దసరా దాకా ఆగండి. నాకు తోకలాగా ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత... కార్యకర్తలు, నాయకులు, విలేకరులకు, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టినవారికి తగ్గట్టుగా నా నిర్ణయం తెలియజేస్తాను’ అని స్పష్టం చేశారు. 
 
తన నియోజకవర్గమైన కడప జిల్లా జమ్మలమడుగులో గురువారం ఏర్పాటు చేసిన ముద్రా యోజన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీ మారే ముందు అందరికీ చెబుతానన్నారు. తాను పార్టీ మారడం గురించి ఇప్పటికే వచ్చిన వార్తలపై సూటిగా స్పందించకుండా... ‘పత్రికలు ఇంకా చాలా రాయాల్సి ఉంది. దసరాకు పూర్తిగా నిర్ణయిస్తాను. ఎమ్మెల్యే పదవి పెట్టుకునిపోతే (రాజీనామా చేయకుండా) అరబొట్టుకు కూడా చెల్లను. అన్నీ ఆలోచించి నిర్ణయం దసరా పండగ తర్వాత చెపుతాను’ అని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.