శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 23 జనవరి 2017 (04:18 IST)

భూసేకరణ అన్యాయమంటే పోలీసులతో కొట్టిస్తారా: టీడీపీపై ధ్వజమెత్తిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వాన్ని బోనులో నిలపెట్టి నిలదీసినంత పని చేసారు పవన్. దళితుల పక్షాన నిలబడి మరీ చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. కలకంఠి కంఠ కన్నీరొలికిన ఇంట అంటూ పోతనామాత్యుడు గతంలో

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోట ముత్యాలమాట.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వాన్ని బోనులో నిలపెట్టి నిలదీసినంత పని చేసారు పవన్. దళితుల పక్షాన నిలబడి మరీ చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. కలకంఠి కంఠ కన్నీరొలికిన ఇంట అంటూ పోతనామాత్యుడు గతంలో చెప్పిన పద్యం కంటే శక్తివంతమైన పదజాలంతో రైతుల పక్షం నిలిచిన పవన్ రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం క్షేమం కాదని తేల్చి చెప్పేశారు.
 
ఆదివారం ట్వీటర్‌లో ఏపీ రైతులు, దళితులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా కడిగేశారు.  ‘పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయకం కాదన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్‌ యార్డ్‌గా మార్చడం ఎంత వరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలి. భూముల సేకరణకు ముందు ఎంత మేరకు నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో.. అంత మొత్తం ఇవ్వాలి. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా వివక్షత పాటించడం మంచిది కాదు. ఒక వేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది’ అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయకం కాదని హితవు చెప్పారు.
 
భూములు కోల్పోయిన రైతులు, దళితులు అన్యాయం అని నోరెత్తితే పోలీసులతో కేసు పెట్టించి మరీ నోరుమూయించడం మంచిదేనా అంటూ పవన్ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల బాధను సమాజ వికాసాన్ని ఆకాంక్షించే వారు అర్థం చేసుకోవలసి ఉందని విచారం వ్యక్తం చేశారు. ‘ఈ భూముల రైతులు తమ వారు కాదనా.. లేదా కాంట్రాక్టర్‌కు ఇబ్బందనా.. గత్యంతరంలేని రైతులు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారు. ఇది అన్యాయం అని అడితే పోలీసులతో కేసు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇకనైనా వారికి న్యాయం చేయండి. అమరావతిలోని కృష్ణానది లంక భూముల రైతుల బాధను సమాజ వికాసాన్ని ఆకాంక్షించే వారు అర్థం చేసుకోవలసి ఉంది. తాము దళితులం అయినందువల్లే నష్టపరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు’ అని పవన్‌కల్యాణ్‌ వరస ట్వీట్లు చేశారు. 
 
కొన్నిరోజుల క్రితమే రాజధాని రైతులతో అమరావతిలో సమావేశమైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీతో, దాని నాయకులతో గట్టిగా ఎలా మాట్లాడేది అంటూ వాపోయిన విషయం తెలిసిందే. కానీ పోలవరం ముంపు గ్రామాల రైతులు, అమరావతి ప్రాంత దళిత రైతుల పట్ల ఎందుకింత వివక్ష చూపుతున్నారు అంటూ పవన్ ఏపీ ప్రభుత్వాన్ని నేరుగా నిలదీయటం సంచలనం కలిగిస్తోంది. ముఖ్యంగా రైతుల కన్నీరు ఏపీకి మంచిది కాదని పవన్ పేల్చిన డైలాగ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలనాతీరును నేరుగా ఆక్షేపించడం మరీ గమనార్హం.

ప్రతిపక్షం నుంచి కాకుండా స్వయానా ఆప్తమిత్రుడి నుంచే ఈ రకమైన నిరసన గళం రావడంతో టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. ప్రభుత్వం, టీడీపీ నేతలు దీనికెలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఎప్పుడు మాట్లాడినా గయ్‌మంటూ లేచే టీడీపీకి మెత్తటి కత్తితో పొడిచినట్లుండే పవన్ కల్యాణ్ మాటలను, విసుర్లను ఎలా అర్థం చేసుకోవాలో పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండడం విశేషం.