బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (10:10 IST)

తితిదే ఈవో నియామకంపై అలా అన్నాడా? లేదే? పవన్ వ్యాఖ్యలపై జనసేన వివరణ

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారిపై నియామకంపై చెలరేగిన వివాదం సద్దుమణిగింది. ఈవోగా ఉన్న సాంబశివరావును తొలగించి, ఆయన స్థానంలో ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సిం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారిపై నియామకంపై చెలరేగిన వివాదం సద్దుమణిగింది. ఈవోగా ఉన్న సాంబశివరావును తొలగించి, ఆయన స్థానంలో ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్రప్రభుత్వం నియమించింది. తితిదే వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై రాష్ట్రంలో వివాదాస్పదమైంది. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ అంశంలో పవన్ జోక్యం చేసుకోవడంతో మంత్రులు, టీడీపీ నేతలు, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఫలితంగా జనసేన వివరణ ఇచ్చింది. 
 
తితిదే బోర్డు ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారిని నియమించడాన్ని తాము వ్యతిరేకించలేదు అని జనసేన ప్రకటించింది. ఇదే విధానాన్ని ఉత్తర భారతంలో కూడా అనుసరించాలని మాత్రమే జనసేన కోరుతోందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేంద్ర రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ తరపున, ఆయన పేరిట ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ సమగ్రత విషయంలో జనసేన నిబద్ధత ఎవరూ ప్రశ్నించలేనిది అని, దేశ సమగ్రతే జనసేన విధానం అని స్పష్టంచేశారు. 
 
అమర్నాథ్, మథుర, వారణాసి వంటి క్షేత్రాలకు కూడా పాలకులుగా దక్షిణాది రాష్ట్రాల వారిని నియమించాలన్న విజ్ఞప్తిని మీరు తప్పని ఎలా అంటారని జనసేన ప్రశ్నిస్తోందన్నారు. రెండు రోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌లో భావం కూడా ఇదేనని గమనించాలన్నారు. ఈ ట్వీట్‌పై పలువురు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వ్యఖ్యలు చేసే ముందు ఆ ట్వీట్‌లోని పరమార్థాన్ని గ్రహించాలని సూచించారు. తమ అధ్యక్షుడి దేశ భక్తిని ప్రశ్నించే వారి నేతి బీర దేశభక్తి గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.