మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (11:57 IST)

ఆస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారు- గల్లా జయదేవ్ మండిపాటు

ఆస్తులు తెలంగాణకు అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్

ఆస్తులు తెలంగాణకు అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. 
 
తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేశ్‌ చర్చను ప్రారంభించారు. ఈ చర్చను ప్రారంభించిన సందర్భంగా.. గల్లా మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో భరత్ అనే నేను సినిమాలో చూపించారని గుర్తు చేశారు. తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆధిపత్యానికి, నైతికతకు జరుగుతున్న పోరాటం ఇది. అంతేగానీ కేంద్రానికి, ఏపీకి మధ్య ధర్మపోరాటం కాదు. దేశంలో భాగమైన ఏపీకి కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని గల్లా జయదేవ్ అన్నారు.
 
గుంటూరు, నెల్లూరు, తిరుపతి సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. విభజన చట్టంలో వున్న హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాను తినను ఇతరులను తిననివ్వనని చెప్పిన మోదీ ఏపీకి అన్యాయం చేశారన్నారు.
 
తెలంగాణలో ఉన్న ఎన్నో విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలు పాత పేరుతో కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్‌లో లేవని గల్లా చెప్పారు. 2014లో పార్లమెంట్ తలుపులు మూసేసి, నిర్దయగా విభజించారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు జయదేవ్‌‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్పీకర్ వారించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ఎంపీలకు మద్దతు పలకడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. 
 
ఇంకా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అన్యాయం చేశారరని మండిపడ్డారు. విభజన నేపథ్యంలో కీలకమైన వన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయని... ఏపీ అన్యాయానికి గురైందని అన్నారు. ఆస్తులను తెలంగాణకు, అప్పులను ఏపీకి ఇచ్చారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు గల్లా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
 
రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని... అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న గల్లా వ్యాఖ్యలు అభ్యంతరకరమని తెలిపారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం ఏర్పడింది. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడాలంటూ టీఆర్ఎస్ ఎంపీలను స్పీకర్ సుమిత్ర కోరారు. అయినా టీఆర్ఎస్ ఎంపీలు శాంతించకపోవడంతో.. గల్లా కాసేపు ఆయన సీట్లో కూర్చుండిపోయారు. 
 
అనంతరం తన ప్రసంగాన్ని మళ్లీ కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గల్లా ప్రసంగానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. ఇతరుల మాటలు రికార్డుల్లోకి ఎక్కువని, గల్లా జయదేవ్ మాటలు మాత్రమే రికార్డుల్లోకి వెళతాయని ఈ సందర్భంగా స్పీకర్ చెప్పారు. గల్లా తన ప్రసంగంలో మోదీపై ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపారు. అవిశ్వాసం పెట్టిన పార్టీకి గంట సమయం ఇవ్వాలన్నది సంప్రదాయమని.. చర్చపై టీడీపీకి సమయాన్ని పెంచాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. కేంద్రం తలచుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు. 
 
ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదన్నారని గల్లా గుర్తు చేశారు. 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని కేంద్ర మంత్రి కూడా చెప్పారు. 2016లో హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటించారు. అయితే హోదా ఇచ్చేది లేదని ఒప్పించి.. చివరికి ప్యాకేజీ విషయాన్ని నీరుగార్చారని గల్లా ఏకిపారేశారు. అన్నీ హామీలను కేంద్రం పక్కనబెట్టిందని దుయ్యబట్టారు.