గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (17:33 IST)

జయలలితపై ఆఖరి అస్త్రమే ఎక్మో... క్షణక్షణానికి క్షీణిస్తున్న అమ్మ ఆరోగ్యం!

ముఖ్యమంత్రి జయలలితపై చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. దానిపేరే ఎక్మో మిషన్(ఈసీఎంఓ). ఇది శరీరంలో గుండె ఆగిపోయిన సమయంలో ఇది రక్తప్రసరణ చేస్తుందని, ప్రాణవాయువును కూడా అందిస్

ముఖ్యమంత్రి జయలలితపై చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. దానిపేరే ఎక్మో మిషన్(ఈసీఎంఓ). ఇది శరీరంలో గుండె ఆగిపోయిన సమయంలో ఇది రక్తప్రసరణ చేస్తుందని, ప్రాణవాయువును కూడా అందిస్తుందని డాక్టర్లు తెలిపారు.
 
జయలలితను సాధారణ స్థితికి తెచ్చే అన్ని వైద్య సదుపాయాలు అందించామని వైద్యులు ప్రకటించారు. మరో 24 గంటలపాటు పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయినా జయలలిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 
 
క్షణక్షణానికి ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతుందని, జయ ఎప్పుటిలోగా కోలుకుంటారో చెప్పలేమని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఇదిలావుండగా గతంలో జయకు వైద్యం చేసిన లండన్ డాక్టర్ రిచర్డ్‌బేలె చెన్నై చేరుకున్నారు. ఆయన కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందనీ, ఆమె కోస దేవుడుని ప్రార్థించాలని కోరారు.
 
ముఖ్యమంత్రి జయలలిత గుండె పని చేయడం ఆగిపోయింది. ఈ కారణంగా ఈసీఎంవో (ఎక్మో) యంత్రం ద్వారా అమ్మ గుండెకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఈ చికిత్సా విధానమంతా క్రిటికల్ కేర్ వైద్యుల పర్యవేక్షణలో సాగుతోంది. అసలు ఎక్మో అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్మో అనేది ప్రాథమికంగా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గకుండా చూసే యంత్రం. ‘ఎక్స్‌ట్రా కార్పోరల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌’గా దీన్ని పిలుస్తారు. గుండె, ఊపిరితిత్తుల్లో సంక్షోభం ఏర్పడినపుడు ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది గుండె, ఊపిరితిత్తుల బాధ్యతలను స్వీకరిస్తుంది. 
 
ఇది రెండు రకాలు... 1) గుండె, ఊపిరితిత్తులు పని చేస్తూనే వాటికి ఎక్మో సహాయకారిగా ఉండటం. 2) పూర్తిగా గుండె, ఊపిరితిత్తులకు విశ్రాంతినిచ్చి ఆ బాధ్యతను ఎక్మో స్వీకరించడం. 
 
మొదటి విధానంలో.. సాధారణంగా జీవక్రియల్లో రక్తంలోని ఆక్సిజన్‌ దహించుకుపోతుంది. తిరిగి రక్తంలో ఆక్సిజన్‌ నింపే బాధ్యత ఊపిరితిత్తులది. అవి విఫలమైనపుడు గుండెకు ఎక్మో యంత్రాన్ని తగిలిస్తారు. అది నేరుగా గుండెకు వచ్చిన చెడు రక్తాన్ని తీసుకొని దానిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తొలగించి, ప్రాణవాయువును నింపి, ఆ రక్తాన్ని తిరిగి గుండె నుంచి ప్రజర్‌ ద్వారా దేహంలోని వివిధ భాగాలకు పంపిస్తుంది. 
 
రెండో విధానంలో... ఇక్కడ గుండె, ఊపిరితిత్తులను పూర్తిగా నిలిపేస్తారు. యంత్రమే ఆక్సిజన్‌ హరించుకుపోయిన చెడు రక్తాన్ని స్వీకరించి, తిరిగి అదే మంచి రక్తాన్ని దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తుంది. ఇందులో రక్తాన్ని వెచ్చబరిచే బాధ్యత యంత్రానిదే. ఇందులో గుండె ఊపిరితిత్తుల పాత్ర ఉండదు. అవి విశ్రాంతి తీసుకొంటాయి. అవి మెరుగుపడ్డాక ఎక్మోకు సమాంతరంగా పని చేస్తాయి. చివరకు ఎక్మోను తొలగిస్తారు.
 
రెండో పద్ధతిలో ఎక్మో ఎనిమిది గంటల పాటు పని చేస్తుంది. అది విజయవంతమై గుండె, ఊపిరితిత్తులు మెరుగు పడితే ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులు, ఎక్మో సమాంతరంగా పని చేయిస్తారు. ఈ పద్ధతిలో యంత్రాన్ని 1-2 వారాలు పనిచేయించవచ్చు.
 
సాధారణంగా ఎక్మోను చివరి అస్త్రంగా భావిస్తారు. ఎక్మో యంత్రం ఉపయోగించడం వల్ల వచ్చే ప్రధాన సమస్య సైడ్‌ ఎఫెక్ట్‌లు. ఇటీవలి కాలంలో వాటిని బాగా తగ్గించగలగడం వల్ల యంత్రం మీదకు వెళ్లిన వాళ్లు బతికి బయటపడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు.