శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (16:21 IST)

ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్: అంతా రాజకీయ లబ్ధికేనన్న జేపీ

తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదం రేపిన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల లబ్ధి కోసం హడావుడిగా రాష్ట్రాన్ని విభజిస్తే.. ప్రస్తుతం పార్టీ ప్రయోజనాల కోసం ప్రజల్లో చిచ్చుపెడుతున్నారని టీడీపీ, టీఆఎర్ఎస్ సర్కార్లపై జేపీ మండిపడ్డారు. చిన్న చిన్న విభేదాలు ముదిరిన సందర్భాలు చాలా ఉన్నాయని, రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తరువాత ఇప్పుడు విభేదాలు సృష్టిస్తున్నారని జేపీ వ్యాఖ్యానించారు. 
 
ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు అంశాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత 13 నెలల్లో హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. కానీ ఎంత చిచ్చు పెడితే అంత రాజకీయ లబ్ధి వస్తుందని రాజకీయ నేతలు అనుకుంటున్నారని, అందుకే రోజుకో దుమారాన్ని రేపుతున్నారని జేపీ ఫైర్ అయ్యారు. ఇదంతా వారి పార్టీలకు లబ్ధి చేకూర్చుకునేందుకేనని ప్రజలు గుర్తించాలని సూచించారు.