గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (14:32 IST)

జగన్‌ను నడిపించేవాడు కావాలి.. నన్నడిగితే ఆలోచిస్తా: 100 రోజులపై జేసీ పొగడ్తలు

యువ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజుల కాలంలో సీఎం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయనుకోండి. ఇక కొన్ని మీడియా సంస్థలైతే జగన్ 100 రోజుల పాలనపై సర్వేలు మొదలుపెట్టాయి. ఆ సర్వేల్లో ఏమేం చెపుతారన్నది పక్కన పెడితే తెదేపా సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. 
 
జగన్ 100 రోజుల పాలన భేషుగ్గా వుందని అన్నారు. 100 రోజులకు 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మావాడే అని అన్నారు. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేశారు. మావాడు చాలా తెలివైనవాడనీ, ఐతే జగన్ మోహన్ రెడ్డిని నడిపించే మంచి నాయకుడు ఒకడు కావాలని అభిప్రాయపడ్డారు. తనను జగన్ అడిగితే ఆలోచిస్తానని అన్నారు. 
 
రాజధాని అమరావతిలోనే వుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జగన్ నేలకేసి కొట్టకుండా మైక్రోస్కోపులో చూడాలని సూచన చేశారు. జగన్ యువకుడు కాబట్టి కొన్ని నిర్ణయాలు త్వరగా తీసుకుంటూ వుంటాడనీ, కాస్త ఆలోచన చేసి తీసుకుంటే బాగుంటుందన్నారు. ఏదేమైనప్పటికీ ఏపీకి మంచి జరగాలనీ, జగన్ మోహన్ రెడ్డికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.