గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (15:18 IST)

భార్యల కంటే పదవులే ముఖ్యం.. ఫిరాయింపుదార్లపై నారాయణ కామెంట్స్!

ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచి.. మరో పార్టీలో చేరుతున్న శాసనసభ్యులపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తనదైనశైలిలో సెటైర్లు వేశారు. పార్టీలు మారుతున్న వారికి భార్యల కంటే పదవులే ముఖ్యమని అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఇలాంటి నేతలను ఎన్నుకున్నందుకు ప్రజలు ఇపుడు బాధపడుతున్నారన్నారు. ఒక పార్టీ తరపున గెలిచిన వారు ఎవరైనా సరే.. ఐదేళ్ల పాటు ఆ పార్టీలోనే కొనసాగాలని, ఆ తర్వాత కావాలంటే పార్టీ మారవచ్చన్నారు. కానీ, ఇపుడు పరిస్థితి మరోలా ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. 
 
పాలేరు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చి, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఖమ్మంలో తెరాస నేతలు ప్లీనరీ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు, కొండా దంపతులు తదితరులను అందలం ఎక్కిస్తున్నారని, ఉద్యమంలో పాల్గొన్న వారిని మాత్రం పట్టించుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణను పాలిస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదని, ఫిరాయింపుదారుల ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రజలకంటే వారసులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. 
 
కేంద్ర మంత్రి వెంకయ్యకు ప్రధాని నరేంద్ర మోడీ దేవుడిలాకనిపిస్తున్నారని, ప్రజలకు మాత్రం దెయ్యంలా కనిపిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద కరువు ఈ ఏడాది వచ్చిందని కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. ఒకవైపు కరవు, మరోవైపు తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే.. రాజకీయ నేతలు మాత్రం తమ హెలికాఫ్టర్లు కిందికి దిగే సమయంలో దుమ్ము లేవకుండా హెలిప్యాడ్ల వద్ద నీటిని చల్లుతూ లీటర్ల కొద్ది నీటిని వృధా చేస్తున్నారని ఆరోపించారు.