మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (16:31 IST)

ఏడేళ్ల చదివితే లోకలే : స్థానికతపై క్లారిటీ ఇచ్చిన కమలనాథన్ కమిటీ!

అది తెలంగాణా కావొచ్చు.. లేదా ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఒకే చోట ఏడేళ్ల పాటు విద్యాభ్యాసం చేసిన వారంతా స్థానికులుగానే పరిగణిస్తారు. ఉద్యోగుల విభజనలో విద్యార్హతల ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. ఈ మేరకు ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి తాము సూచించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో కమిటీ ఉంచింది. 
 
కేంద్రం ఆమోదం మేరకు 19 పేజీల మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచింది. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు ఉంటాయని, అయితే రిటైరయ్యే ఉద్యోగులకు మాత్రం ఆప్షన్లు లేవని అందులో స్పష్టం చేసింది. ఆర్టికల్ 371డి రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుందని, గ్రూప్‌-4 ఉద్యోగులను పూర్తిగా స్థానికత ఆధారంగా విభజించాలని నిర్ణయించారు. ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత నిర్ణయిస్తామన్నారు. 
 
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. నాలుగోతరగతి ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వికలాంగులకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఆప్షన్ సదుపాయం ఉంటుందని కమిటీ తెలిపింది. అలాగే, ఒక్కసారి ఆప్షన్‌ ఇస్తే మళ్లీ మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. విధివిధానాలపై అభ్యంతరాలు, సలహాలు ఉంటే ఆగష్టు 5 లోపు ఇవ్వాలని కమలానాథన్‌ కమిటీ కోరింది. 
 
వాటిని పరిశీలనకు తీసుకున్న తర్వాత మళ్లీ కేంద్రం తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని చెప్పారు. 1975 ఆర్డర్ సర్వీసు రికార్డ్ ఆధారంగా స్థానికతను గుర్తిస్తామన్నారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ ఇస్తే తీవ్రమైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించింది.