శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (23:24 IST)

కాపు రిజర్వేషన్ల హీట్.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు దగ్ధం చేసిన గుంటూరు మహిళలు

కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన ఉద్యమం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టే వరకూ వచ్చేసింది. కాపుల రిజర్వేషన్ల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు సరిగా లేదంటూ ఆదివారం నాడు గుంటూరు జిల్లా రేపల్లెలో కాపు మహిళలు కొందరు ఆయన ఫ్లెక్సీకి నిప్పు పెట్టి దగ్ధం చేశారు. తాము ఎంతగానో అభిమానించే సినీ హీరో, కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సరిగా స్పందించడం లేదంటూ వారు ఆరోపించారు. 
 
తమకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ చెప్పారనే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశామని వారు చెపుతున్నారు. మరోవైపు మూడురోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడకు మద్దుతుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలుచోట్ల పవన్ ఫ్లెక్సీల్ని ధ్వంసం చేసిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్‌కు బలమైన అభిమానులు ఉన్న జిల్లాల్లో ఒకటిగా చెప్పే గుంటూరు జిల్లాలో ఆయన పట్ల ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేయడం మాని జనంలోకి రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
ఇంకోవైపు కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిప్పులు చెరిగారు. వరుస ట్విట్టర్లతో కడిగిపారేశారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో పీకే(పవన్ కళ్యాణ్) మాట్లాడింది ఆయనకైనా అర్థమైందా అంటూ మొదలెట్టారు. అంతేకాదు ఓ విశ్వదాభిరామ పద్యాన్ని కొత్త పద్ధతిలో చెప్పారు. 
 
అదేమిటంటే... 'కమ్మల మనస్తత్వమున్న కాపుల కన్నా స్వచ్చమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు... విశ్వదాభిరామ వినురవేమ' అంటూ ట్వీట్ చేశారు. ఇంకా వర్మ తన ట్వీటులో పీకేకి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విజ్ఞప్తి, ఒక్కసారి మీరిచ్చిన జనసేన స్పీచ్ మీకు మీరే చూసుకుని మీరే నేర్చుకోండి. 
 
పీకే అభిమానిగా నేను వ్యక్తపరిచిన నిజాలను వ్యతిరేకించే ఏ పీకే ఫ్యాన్ అయినా నా దృష్టిలో నమ్మకద్రోహే. మళ్లీ చెపుతున్నా... పీకే తన జనసేన లాంఛ్ స్పీచ్ ను రిపీట్ మోడ్ లో చూసుకుని అర్థం చేసుకుంటే తన అన్నయ్య కంటే వరెస్ట్ అని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు నా విజ్ఞప్తి ఏమంటే.. మీరంతా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్పిన నిజాన్ని పీకేకు చెపుతారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.