బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 20 మే 2017 (13:15 IST)

'దమ్ము, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం.. రా' : గొట్టిపాటికి కరణం సవాల్

తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి వల్లే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన

తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి వల్లే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఓ ఎమ్మెల్యేగా అందరినీ కలుపుకుని పోవాల్సిన వ్యక్తి, ఇలా హత్యారాజకీయాలకు తెగించడం మంచిది కాదని హితవు పలికారు. 
 
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో తమ వర్గీయులు ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేయడంపై ఎమ్మెల్సీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. అడవిలో జంతువులను వేటాడినట్టు వేటాడి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారంతా గత 30 ఏళ్లుగా పార్టీ జెండాను మోశారని అన్నారు. అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్తలను గొట్టిపాటి మనుషులు చంపేశారని మండిపడ్డారు. 'దమ్ము, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం.. రా' అంటూ గొట్టిపాటికి సవాల్ విసిరారు.
 
గతంలో వేలాది మంది వైసీపీ కార్యకర్తలను మోసం చేశాడని... ఇప్పుడు టీడీపీలోకి వచ్చి 95 వేల మంది కార్యకర్తలను మోసం చేయాలని చూస్తున్నాడంటూ గొట్టిపాటిపై విరుచుకుపడ్డారు. కేవలం స్వలాభం కోసమే గొట్టిపాటి రవి టీడీపీలో చేరారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాట రాకూడదనే కారణంతోనే తాము ఓపికపడుతున్నామని... లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.