బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (17:10 IST)

దళితవాడల్లో పాఠశాలలు మానేసిన పిల్లలందరినీ తిరిగి చేర్పిస్తాం : కారెం శివాజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితవాడల్లో పాఠశాలలు మానేసిన పిల్లలందరినీ తిరిగి చేర్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో రిజర్వేషన్లపై మరింత పోరాటం చేస్తామన్నారాయన. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన కారెం శివాజీ తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఎస్సీ, ఎస్టీ సంఘాలతో సమావేశమయ్యారు. 
 
రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల్లోని 59 ఉపకులాలకు చెందిన వారి సంక్షేమానికి ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సంవత్సరానికి గాను సాంఘిక సంక్షేమ శాఖకు రూ.3,236 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందని గుర్తు చేశారు. అందులో ఎన్‌టిఆర్‌ విద్యోన్నతికి రూ.14 కోట్లు కేటాయించగా 320 మంది విద్యార్థులకు సివిల్‌ సర్వీస్‌ శిక్షణ ఇస్తున్నామన్నారు. 
 
ఈనెల అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని బలహీనవర్గాలకు చెందిన ఆరు లక్షల మందికి ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిచేకూర్చామని మిగిలిన వారందరికీ కూడా త్వరలో గృహ నిర్మాణ పథకాన్ని అందే విధంగా చూస్తామన్నారు.