శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (13:47 IST)

డీఎల్‌ఎఫ్‌ భూములతో టి. సర్కారు సంబంధం లేదు: కేసీఆర్

డీఎల్ఎఫ్ భూములకు తమ సర్కారుకు ఎలాంటి సంబంధం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం డీఎల్‌ఎఫ్‌ భూములపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో 471 ఎకరాలు ఏపీఐఐకి అప్పగించారన్నారు. 
 
ఏపీఐఐసీ కొంత భూమిని విక్రయించి ప్రభుత్వానికి నిధులు ఇచ్చారన్నారు. డీఎల్‌ఎఫ్‌ 580.81 కోట్లతో 31.31 ఎకరాలు కొనుగోలు చేసిందని, 2013లో డీఎల్‌ఎఫ్‌ అదనంగా రూ.34 కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుందని చెప్పారు.
 
డీఎల్‌ఎఫ్‌ కొనుగోలు చేసిన భూముల్లో వారసత్వ భూములు ఉన్నందున రాయదుర్గంలో గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమి ఇచ్చిందని కేసీఆర్‌ తెలిపారు. ఈ భూములకు తమ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 
 
ఈ భూములు అమ్మవద్దంటూ తాము పోరాడామని సభకు తెలియజేశారు. గత ప్రభుత్వం 10 వేల కోట్ల విలువైన భూములు అమ్మిందని, తెలంగాణ ఏర్పాడక ముందే భూకేయింపులు జరిగాయని తెలిపారు.
 
కొందరు పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని బద్నామ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. దొర ఇంకో దొరకు రాసిచ్చారనడం సమంజసమా అని కేసీఆర్‌ ప్రశ్నించారు.