శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (15:29 IST)

మద్యంపై టి-సర్కార్ మథనం.. చీప్ లిక్కర్‌పై వెనకడుగు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై మథనపడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ప్రవేశపెట్టదలచిన చీప్ లిక్కర్‌పై వెనక్కితగ్గాలని భావిస్తోంది. ఎందుకంటే చీప్ లిక్కర్‌పై రాష్ట్రంలోని అన్ని పక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. దీంతో మద్యంపై వెనక్కితగ్గాలనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై  బుధవారం జరిగే టీ మంత్రివర్గ సమావేశం తర్వాత ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 
 
ఈ అంశానికి సంబంధించిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చీప్‌ లిక్కర్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీనిపై సీఎంతో చర్చిస్తానని సాక్షాత్తూ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. అదేసమయంలో రాష్ట్రంలోని మద్యం తయారీ కంపెనీలైన డిస్టిలరీల యజమానులు మంగళవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. అక్టోబరు నుంచి రానున్న కొత్త విధానం ద్వారా, కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వవద్దంటూ వారు సీఎంను కోరారు. 
 
రాష్ట్రానికి సరిపడా మద్యాన్ని తయారు చేసి అందజేస్తామని, కొత్త వాటికి అనుమతి ఇస్తే... తమ ఉత్పత్తిని తగ్గించుకోక తప్పదనీ వారు విన్నవించుకున్నట్లు తెలిసింది. దీంతో చీప్ లిక్కర్‌పై కేసీఆర్ సర్కారు వెనకడుగు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.