శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (06:14 IST)

సన్నాసే సన్నాసి మాటలు మాట్లాడుతాడు...! కేసీఆర్..! ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో.. ప్ర‌జా సంఘాలు

దొరల సంస్కృతి, భాషతో బెదిరించాలని చూస్తే సహించేది లేద‌ని, సన్నాసే స‌న్నాసి మాటలు మాట్లాడతాడని పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సీఎంకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆవేశానికి గురి కావడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ తన చెప్పుచేతల్లో ఉండాలనుకోవడం కేసీఆర్ మూర్ఖత్వమ‌ని విమర్శించారు. 
 
‘‘ఓ పిచ్చోడు ప్రాణహిత-చేవెళ్లపై రాద్ధాంతం చేస్తున్నాడు... అతడు ఓ సన్నాసి’’ అంటూ నైనాల గోవర్ధన్‌పై తెలంగాణ సిఎం చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, నైనాల గోవర్ధన్‌కు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్‌ చంద్రకుమార్‌,  తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, ఇత‌రులు నైనాల గోవర్ధన్‌కి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రకుమార్‌ మాట్లాడుతూ... ప్రాజెక్టు ఎక్కడ కడితే ఖర్చు తగ్గుతుందో, ప్రజలకు మేలు జరుగుతుందో అక్కడే కట్టాలన్నారు. 
 
ప్రజలు ఏం మాట్లాడినా అధికారంలో ఉన్నవారు వాటికి గౌరవమివ్వాలని, దానికి వ్యతిరేకంగా చెబితే పిచ్చివాడు, సన్నాసి అనే మాటలు వాడడం చాలా బాధాకరమన్నారు. తానూ ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వాడినేనని, గోవర్ధన్‌ గత 20 ఏళ్లుగా జిల్లా ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్నారన్నారు. అందరూ తన చెప్పుచేతుల్లో ఉండాలని కేసీఆర్ అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మ‌ని చెప్పారు. కాగా, కేసీఆర్‌ మాటలు అప్రజాస్వామికం, అహంకారపూరితమని చెరుకు సుధాకర్‌ అన్నారు.