గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 మే 2016 (09:18 IST)

టీడీపీ పార్టీకి జాతీయ పార్టీ అయ్యే సీన్ ఉందా.. మరో రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలుచుకునేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయా? అసలు ఆ పార్టీకి అంత సీనుందా? గత టీడీపీ మహానాడు సమయంలో టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించారు. కానీ, భారత ఎన్నికల సంఘం మాత్రం టీడీపీని జాతీయ పార్టీగా అధికారికంగా గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ జాతీయ పార్టీ హోదాపై మరోమారు చర్చకు తెరలేసింది.
 
నిజానికి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు దక్కాలంటే రెండు రాష్ట్రాల్లో కలిసి 18 మంది ఎంపీలు ఉండాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మూడు రాష్ట్రాల్లో 11 మంది ఎంపీలు (లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 2 శాతం) ఉన్న పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. దక్షిణ భారతదేశంలో టీడీపీకి మాత్రమే జాతీయ పార్టీగా రూపొందే అవకాశాలున్నాయి. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఛాన్స్ ఒక్క టీడీపీకి మాత్రమే ఉంది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కైవసం చేసుకున్నా... జాతీయ పార్టీ హోదా టీడీపీ సొంతమవుతుంది. ఆ మేరకు ఎన్టీఆర్‌ కల నెరవేరుతుంది. 2019 ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఎంపీలను కలిగి ఉండే స్థాయికి తెలుగుదేశం చేరుకుంటుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. కర్ణాటక, ఒడిసా, తమిళనాడుల్లో కూడా పార్టీని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.