గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (19:03 IST)

నిద్రావస్థలో ఉండే పవన్‌ కళ్యాణ్‌కు ఎంపీలు ఏం చేశారో ఎలా తెలుస్తుంది : కేశినేని నాని ప్రశ్న

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. ఆర్నెల్లకోసారి మాట్లాడి.. మరో ఆర్నెల్లపాటు నిద్రావస్థలోకి జారుకునే పవన్ కళ్యాణ్‌కు టీడీపీ ఎంపీలు ఏం చేశారో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశినేని నానిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఘాటైన విమర్శలు చేసిన విషయంతెల్సిందే. వీటిపై కేశినేని నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
పార్టీ అధినేత అనేవాడు ప్రజల్లో ఉంటే ప్రజాసమస్యలు తెలుస్తాయని, చేతనైతే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ ఆర్నెల్లకోసారి మాట్లాడి, మరో ఆర్నెల్ల పాటు నిద్రావస్తలో ఉంటే ఎంపీలు ఏం చేశారో ఎలా తెలుస్తుందన్నారు. ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను అనే పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెపుతూనే.. తమకు కూడా పవన్‌ను ప్రశ్నించే అవకాశం కల్పించారన్నారు. 
 
తిడితే కేసీఆర్‌లా తిట్టాలి.. పడితే సీమాంధ్ర ఎంపీలా పడివుండాలన్న పవన్ వ్యాఖ్యలపై కేశినేని మండిపడ్డారు. కేసీఆర్‌లా తిడితే ఆంధ్రాలో పడేవారెవ్వరూ లేరన్నారు. సీమాంధ్ర ఎంపీలు, లేదా ప్రజలు అంత పౌరుషం లేనివారు కాదన్నారు. గతంలో కేంద్రమంత్రిగా ఉన్న మీ అన్నగారు (చిరంజీవి) ఏం సాధించారు? అని ఆయన నిలదీశారు. హైదరాబాదులో 60 లక్షల మంది సీమాంధ్రులుంటే సెక్షన్ 8 వద్దని ఎలా అంటారని ఆయన నిలదీశారు. 
 
ఏపీకి చెందిన ప్రభుత్వోద్యోగులపై ప్రాంతీయ విద్వేషాలతో దాడులు చేస్తుంటే సెక్షన్ 8 కావాలని డిమాండ్ చేయాలా? వద్దా? అని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే భద్రత అవసరం లేదా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చేస్తుంటే సీమాంధ్రులు ఎటు పోవాలని ఆయన నిలదీశారు. హైదరాబాద్‌లో ఉన్న మీ ఆస్తులు కాపాడుకునేందుకు, సినిమాలు ఆడించుకునేందుకు సెక్షన్ 8 వద్దని అంటారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 
 
ఇకపోతే టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ అడిగారని, టీడీపీ ఎంపీలు అక్కడి గోడలు చూడడం లేదని, ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్నారన్నారు. కేశినేని నానికి ఎంపీ టికెట్ రాక ముందు 18 నెలలు కష్టపడ్డాడని ఆయన తెలిపారు. సుజనా చౌదరి గారు మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంటే అప్రమత్తమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 8,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు మళ్ళించారన్నారు. 
 
అలాగే టీడీపీ నుంచి ఎంపీలుగా గెలవగానే పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఏపీలో కలిపేలా చేశామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం మంత్రుల వద్దకు తిరిగిన వ్యక్తి సుజనా చౌదరి అని అన్నారు. అలాగే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారి వంశం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనను పవన్ కల్యాణ్ అడగడమేంటని కేశినేని ప్రశ్నించారు. ఆస్తులన్నీ ప్రజలకు ధారబోసి, నిరాడంబర జీవితాన్ని గడిపే అశోక్ గారిని ప్రశ్నించడమా? అని కేశినేని ప్రశ్నల వర్షం కురిపించారు.