శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By eswar
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (12:58 IST)

వ్యవసాయం చేసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల

కాంగ్రెస్ అధికారం కోల్పోయినా కేంద్ర మాజీమంత్రివర్యుల్లో కొందరు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుంటే మరికొందరు వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. కేంద్ర మాజీ రైల్వే సహాయమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. నిత్యం కార్యకర్తలు, అభిమానులు మధ్య గడిపే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో డిల్లీలో క్వార్టర్ ఖాళీ చేసి సొంత ఊరు కర్నూలు జిల్లా లద్దగిరికి కుటుంబంతో సహా నివాసం మార్చారు.
 
వ్యవసాయ నేపథ్యం గల కుటుంబం కావడంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించినా తరచూ వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునేవారు. కానీ ఇప్పుడు పూర్తికాలం తన సొంత వ్యవసాయ  క్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉదయం లేవగానే తన జీపు తానే నడుపుకుంటూ పొలానికి వెళ్లి కూలీలకు పనులు పురమాయించి వస్తున్నారు.
  
తన పొలంలో పండ్ల తోటలపై పూర్తి దృష్టి సారించారు. 60 ఎకరాల్లో ఉన్న మామిడితోటలో చెట్లను క్రమపద్ధతిలో పెంచే పనిలో నిమగ్నమయ్యారాయన. మరో 25 ఎకరాల్లో గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసేందుకు పూణెకు చెందిన అగ్రికల్చరల్ కన్సల్టెన్సీతో సంప్రదించారట. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి లాభసాటిగా వ్యవసాయాన్నినిరూపిస్తానంటున్నారు కోట్ల. వ్యవసాయం తమ కుటుంబ సంప్రదాయమని, ఎంపిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా కూడా వ్యవసాయం చూసేవాడినని, ఇప్పుడు పూర్తికాలం వ్యవసాయం చేస్తానన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మరో ఐదేళ్ల తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటున్నారాయన. రాష్ట్ర విభజన తప్పు కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ కాదని ఇతరులకు అధికారం ఇచ్చారని, అధికారం వచ్చినవాళ్లు కాంగ్రెస్ కంటే మెరుగ్గా చేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు కోట్ల. సొంత ఊర్లో వ్యవసాయం చూసుకుంటూ గడపడం సంతృప్తికరంగా ఉందన్నారు. 
 
వ్యవసాయం మానుకొని అందరూ పట్టణాల్లో స్థిరపడిపోతున్నారన్నారు. ఫలితంగా ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని, పశుసంపద కూడా తగ్గిపోతుందన్నారు. రాజకీయాల్లోకంటే రైతుగానే తృప్తిగా ఉంటుందన్నారు. వ్యవసాయంలో కష్టపడితే నష్టం ఉండదన్నారు. వర్షాలు కలసివస్తే రైతుకు ఎలాంటి నష్టం ఉండదన్నారు కోట్ల.
 
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న పశువులను పెంచడంలో కోట్ల చూపే శ్రద్ధ ఆసక్తి కరం. ఒక్క ఆవును కొని వంద అవులను తయారుచేశారంటే ఆయనకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో స్పష్టమవుతుంది. ఇంటికి సమీపంలో పశువుల కోసం విశాలమైన షెడ్ ఏర్పాటు చేశారు. చాలా ఏళ్ల క్రితం ఒక ఆవును కొని వాటి సంతానం ఎప్పటికప్పడు పెరుగుతూ వంద ఆవులకు చేరింది. ఆవులతోపాటు బర్రెలు, ఎద్దులు ఉన్నాయి. 
 
ఉదయం పొలానికి వెళ్లే ముందు పశువుల షెడ్డుకు వెళ్లి వాటి మంచి చెడులు చూడ్డం ఆయనకు అలవాటు. ఎంపిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, అధికారంలో ఉన్నా లేకున్నా లద్దగిరిలో ఉంటే మాత్రం పశువులను చూడకుండా ఉండలేరు కోట్ల.