బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (14:01 IST)

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు టాటా ఓకే : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు టాటా పవర్ సంస్థ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నిరర్థక భూముల ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం బయోమాస్ అభివృద్ధికి ఆసక్తిని కనబరించిందని వివరించారు. పవన విద్యుత్‌ ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
 
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి మంత్రి కె.తారకరామారావు వివరించారు. మంగళవారం ముంబైలోని ముంబై హౌస్‌లో టాటా గ్రూప్ సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని మంత్రి వివరించారు. వాటర్‌గ్రిడ్, టి- హబ్, ఆర్‌ఐసీహెచ్, పారిశ్రామిక కారిడార్లు, స్మార్ట్ సిటీలు, సోలార్ పవర్ పార్క్, ఏరోస్పేస్ పార్క్, పేదలకు ఇళ్లనిర్మాణం, హైదరాబాద్‌లో మౌలిక వసతులు తదితర కార్యక్రమాలను మంత్రి వివరించారు. 
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ముందుకువచ్చింది. పలు ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్  టౌన్‌షిప్‌ల అభివృద్ధికి టాటా రియల్టీ గ్రూప్ అంగీకారం తెలిపినట్టు మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ పార్క్ అభివృద్ధికి, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థలపై అధ్యయనంపై సేవలు, లైట్‌రైల్ సేవల ద్వారా మెట్రోరైల్ బలోపేతానికి సహకారం అందించనుందని వెల్లడించారు.