గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (10:21 IST)

కరోనా టెస్టులు చేసుకుంటేనే కాపురం చేస్తానన్న భార్య... ఎక్కడ?

కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది. ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. ఈ కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారిని ఖననం చేసేందుకు కూడా తోబుట్టువులు, బంధువులు ముందుకురావడం లేదు. ఇలాంటి శవాలను చెత్తను తరలించే రిక్షాల్లో తరలించాల్సిన దయనీయపరిస్థితి నెలకొంది. ఈ కరోనా వైరస్ అంతలా భయపెడుతోంది.
 
ఇపుడు కరోనా వైరస్ సోకిందన్న భయంతో భర్తతో కాపురం చేసేందుకు ఓ భార్య నిరాకరించింది. పైగా, కరోనా టెస్టు చేయించుకుంటేనే ఇంట్లోకి అడుగుపెట్టాలంటూ కండిషన్ పెట్టింది. దీనికి ఆ భర్త అంగీకరించకపోవడంతో ఆమె ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని కర్నూలు జిల్లా, ఆదోనీ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలంగాణా రాష్ట్రంలోని మిర్యాలగూడలో ఓ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో లారీ రాకపోకలు ఆగిపోవడంతో తన స్వగ్రామానికి వచ్చాడు. 
 
అయితే, ఇంటికి వచ్చిన భర్తను భార్య అడ్డుకుంది. తెలంగాణా రాష్ట్రంలో ఎక్కువగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయనీ, అందువల్ల కరోనా పరీక్షలు చేయించుకుని ఇంట్లోకి రావాలంటూ పట్టుబట్టింది. వైరస్ సోకి ఉంటే అది తనకు, తన పిల్లలకు సోకుతుందని, కాబట్టి పరీక్షలు చేయించుకుని, వైరస్ సోకలేదని తేలిన తర్వాతే రావాలని కోరింది. 
 
అందుకు భర్త వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి అది పోలీస్ స్టేషన్ మెట్లెక్కేందుకు కారణమైంది. స్పందించిన పోలీసులు భార్యాభర్తలిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిద్దరికీ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.