బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (14:21 IST)

రేవంత్‌ బెయిల్‌పై ఎల్. రమణ, గాలి ముద్దుకృష్ణమ కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయి తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే, రెండో ముద్దాయి స్టీఫెన్ సన్ అని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లపై స్పష్టమైన ఆధారాలున్నాయని, ట్యాపింగ్ కేసులో సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని గాలి డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై రెండు రాష్ట్రాలకు హక్కు ఉందని గాలి అన్నారు.  
 
గవర్నర్ అనుమతి లేకుండా టీ.ఏసీబీ అధికారులు తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే హైదరాబాద్‌లో ఏపీ పోలీస్ స్టేషన్లు కూడా అవసరమని నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గాలి మాట్లాడారు. సెక్షన్ 8 కింద గవర్నర్ కు విచక్షణాధికారాలు ఉన్నాయని, షెడ్యూల్ 9, 10 కింద ఏపీకి కూడా వాటా, హక్కు ఉందని ముద్దుకృష్ణమ స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ ఇవన్నీ తమవే అంటున్నారని మండిపడ్డారు. 
 
మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని రమణ స్పష్టం చేశారు. టీడీపీ ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నామని ఎల్.రమణ చెప్పారు.
 
ప్రజాసమస్యలపై టీడీపీ పోరాడుతూనే ఉంటుందని, పోరాటంలో రాజీ పడేది లేదన్నారు. కార్యకర్తల అండతో, మొక్కవోని ధైర్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై పోరాడతామని రమణ వ్యాఖ్యానించారు. కేవలం కుట్రతోనే తమ సహచరుడు రేవంత్ రెడ్డిని కేసులో ఇరికించారని వెల్లడించారు. రేవంత్‌కు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.