బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (09:30 IST)

తెరాస రాజ్యసభ సభ్యులుగా ధర్మపురి - కెప్టెన్ లక్ష్మీకాంత రావు

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులుగా సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఎంపికయ్యారు. అలాగే, వీరు పెద్దల సభలో అడుగుపెట్టడం కూడా లాంఛన ప్రాయంగా మారనుంది. వీరిలో ఒకరు తనను నమ్మి కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరి తన వెంట నడిచిన నేత కాగా, మరొకరు అత్యంత విశ్వసనీయుడు కావడం గమనార్హం. తెరాస పార్టీ తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులుగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. 
 
అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన పేరును ఖరారు చేశారు. మెదక్‌ జిల్లాకు చెందిన ఫరీదుద్దీన్ వైఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తర్వాత 2014లో తెరాస అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరారు. మైనారిటీ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యా బలం లేకపోవడం.. తెరాసకు ఏకంగా 82 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురిల ఎన్నిక లాంఛన ప్రాయంగా మారింది.