శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (13:38 IST)

వివాదాస్పద భూములపై చంద్రబాబు కొరడా: ఒప్పందాలు రద్దు!

వివాదాస్పద భూములపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొరడా ఝుళిపించారు. గత ప్రభుత్వాలు అక్రమంగా కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చంద్రబాబు సర్కారు చర్యల్ని వేగవంతం చేసింది. వివాదాస్పదంగా మారిన వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూముల కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. 
 
ఫలితంగా వాన్‌పిక్ సంస్థకు కేటాయించిన భూములు తిరిగి ప్రభుత్వ సొంతం కానున్నాయి. ఈ సంస్థకు గతంలో ప్రకాశం జిల్లాలో 13,202 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 5,675 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం వాన్‌పిక్‌ సంస్థ అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడిందని అవినీతిపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. 
 
అదేవిధంగా అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లోని లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు కేటాయించిన 8884 ఎకరాల భూములను కూడా వెనక్కి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇక్కడ కేటాయించిన భూముల రేట్లలో అనేక అవకతవకలు జరిగాయని, సర్వీస్‌ ఛార్జ్‌ని చాలా తక్కువ వసూలు చేయడంవల్లే ప్రభుత్వ ఖజానాకు వేలకోట్లలో నష్టం వాటిల్లందని మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి తెలిపారు.