శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (16:12 IST)

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు రైతు బిడ్డ.. జస్టీస్ లావు నాగేశ్వర రావు

దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తెలుగు రైతు బిడ్డ ఒకరు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేరు లావు నాగేశ్వర రావు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన ఈయన శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. 
 
ఈయన 30 యేళ్లుగా సేవలందిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి అందుకున్న అతి కొద్ది మందిలో లావు నాగేశ్వరరావు ఒకరు కావడం గమనార్హం. 
 
1957, జూన్‌ 8వ తేదీన గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించిన ఈయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఆయన విద్యాభ్యాసం పెదనందిపాడు, గుంటూరులో సాగింది. గుంటూరులో కొన్నాళ్లు న్యాయవాదిగా విధులు నిర్వహించి అనంతరం రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. 
 
అక్కడ సుమారు దశాబ్ద కాలం న్యాయవాదిగా పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రముఖ కేసులను చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2003-04 అనంతరం 2013-14 కాలంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొంది ఇపుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.